ఓపెన్ పేజి:  చట్టం.. నైతికత..  సాహిత్యం.. 

ఓపెన్ పేజి:  చట్టం.. నైతికత..  సాహిత్యం.. 

చట్టం, నైతికతకి సంబంధం ఉందా? కొన్నిసార్లు నైతికతతో చూస్తే తీర్పులు సరిగ్గా ఉన్నట్టు అనిపించదు. నైతికత ఆధారంగా తీర్పులని వెలువరించడానికి వీల్లేదు. ఆలివర్ ట్విస్ట్​లో చార్లెస్ డికెన్స్ ‘లా’ని (చట్టాన్ని) గాడిదతో పోల్చాడు. అలాంటప్పుడు సాహిత్యానికి చట్టాలకి సంబంధం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే వస్తూ ఉంటాయి. అదే విధంగా నైతికత అన్న అంశానికి చట్టానికి సంబంధం ఉంటుందా? ఈ రెండింటికి సంబంధం ఉందని కొందరంటారు. ఏమాత్రం సంబంధం లేదని మరికొందరు అంటారు. 

నైతికతని క్రోడీకరిస్తే చట్టం ఏర్పడిందని చాలామంది భావన. ఈ రెండింటికి సంబంధం లేదని మరికొంతమంది భావిస్తారు. మనిషి సాంఘిక ప్రవర్తనలో వాని వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని మరికొంతమంది భావిస్తారు. నైతికత ఆధారంగా కోర్టులు తమ తీర్పులని ప్రకటించవు. అమల్లో ఉన్న చట్టాల ఆధారంగా ప్రకటిస్తాయి.

 నేరానికి సంబంధించిన చట్టాలన్నింటిలో మనిషి నైతికత అంతర్లీనంగా ఉంటుంది. భారతీయ శిక్షాస్మృతిలోని నేరాలని గమనిస్తే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. అదేవిధంగా వ్యక్తిగత చట్టాలని గమనించినా, సివిల్ శాసనాలని గమనించినా ఇదే విషయం మనకి కనిపిస్తుంది. అయినా కూడా కోర్టులు చట్టానికి వ్యతిరేకంగా పోవడానికి వీల్లేదు. 

ఇక సాహిత్యం విషయానికి వస్తే సాహిత్యానికి, చట్టాలకి సంబంధం లేదు. అయితే న్యాయమూర్తులు, న్యాయవాదులు మనుషులే కాబట్టి వారికి సాహిత్యంతో సంబంధం ఉంటుంది. కొన్ని తీర్పుల్లో తమ అభిప్రాయాన్ని బలపరచడానికి వాళ్లు సాహిత్యాన్ని ఊతకర్రగా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి చాలా తీర్పుల గురించి రాశాను. అయినా మళ్లీ మళ్లీ చెప్పక తప్పదు.

షేక్‌‌స్పియర్ రాసిన ‘మర్చంట్ ఆఫ్ వెనిస్’ నాటకానికి చట్టానికి దగ్గరి సంబంధం ఉంది. స్పెసిఫిక్ రిలీఫ్ ఉంటుంది. అందులో ‘‘నాకు బాండ్ ఉంది. నా బాండ్​కి వ్యతిరేకంగా మాట్లాడటానికి వీల్లేదు. నా బాండ్​ని పొందుతానని నేను ప్రమాణం చేశాను” ఇవి మర్చంట్ ఆఫ్ వెనిస్​లో షైలాక్ మాటలు. ఈ విషయాలని సుప్రీంకోర్టు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్​మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ సిబ్ కో ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (2022) కేసులో ఉదహరించింది. ఎస్.డి.బి.ఎ. కోరిన వడ్డీ మొత్తం న్యాయబద్ధం కాదని కోర్టు ప్రకటించి, దాని క్లెయిమ్​ని కొట్టివేసింది. ప్రతివాది శరీరం నుంచి పౌండ్ మాంసాన్ని వాది కోరినట్టుగా పరిగణించాల్సి ఉంటుందని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఒక వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు అది సివిల్​కి సంబంధించినది అయినప్పుడు, అందుకు ఆ వ్యక్తి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయాల అవగాహన కోసం చట్టాలు తెలిసి ఉండాలి. అన్ని పరిస్థితులకి తగినట్టుగా చట్టం ఉండదు. అందుకని చట్టాలకి వ్యాఖ్యానాలు అవసరం ఏర్పడతాయి. వ్యాఖ్యానాలే కాదు. వాటి మీద పునర్ వ్యాఖ్యానాలు కూడా ఉంటాయి. ఈ పరిస్థితుల్లోనే నైతికత, మంచి మనస్సాక్షి అనేవి అవసరం అవుతాయి. వాటి ప్రాముఖ్యత పెరుగుతుంది. నాటకాల్లోని పాత్రలు ఎదుర్కొంటున్న సమస్యలని న్యాయమూర్తులు ఎదుర్కొంటున్నారు. అందుకు ఉదాహరణలుగా ఎన్నైనా పేర్కొనవచ్చు.

ఎస్పీ గుప్తా కేసు (1981) తీర్పుపై రివ్యూ పిటీషన్​ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్- ఆన్ రికార్డ్ అసోసియేషన్ (1993) కేసులో కోర్టు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. న్యాయమూర్తుల ఎంపిక విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో రాజ్యాంగం ఎవరికి ప్రాధాన్యతని ఇస్తుంది? ఈ ప్రశ్నతో విసిగిపోయిన న్యాయమూర్తి రత్నవేల్ పాండియన్, షేక్‌‌స్పియర్ నాటిక ‘మర్చంట్ ఆఫ్ వెనిస్’ని ఉదహరిస్తారు. అందులోని షైలాక్ పంక్తులని న్యాయమూర్తి ఈవిధంగా ఉటంకిస్తారు. ఏ డేనియల్ కమ్ టు జడ్జిమెంట్! డేనియల్ షైలాక్ పోర్షియాను కోరినట్టు తెలివైన న్యాయమూర్తి ద్వారా తెలివైన తీర్పును పొందొచ్చు. ఆవిధంగా సాయపడటానికి ఈ పంక్తులని న్యాయమూర్తి ఉటంకించారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన హెచ్.ఎల్. దత్తు కూడా షేక్​స్పియర్ ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’లోని లూసియానా ప్రసిద్ధపంక్తులని ‘ఎ మ్యాన్ ఈజ్ మాస్టర్ ఆఫ్ హిజ్ లిబర్టీ’ అని ప్రస్తావించారు. పెబమ్ నిన్గోల్ మికోయ్​ దేవి (2010) కేసులోని నివారక నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ వ్యక్తి స్వేచ్ఛ విస్తృతపరుస్తూ తీర్పు చెప్తూ ఈ వాక్యాలని న్యాయమూర్తి దత్తు ఉదహరించారు.

భారత రాజ్యాంగంలోని మూడవ పార్టు ముఖ్యమైనది. అందులో ప్రాథమిక హక్కులని పొందుపరిచారు. అందులో ప్రజాహిత పబ్లిక్ ఆర్డర్, మర్యాద లేదా నైతికత ప్రయోజనాలు అన్న పదబంధం కనిపిస్తుంది. అదేవిధంగా రాతపూర్వకంగా లేని కామన్ లా అనేది మన న్యాయశాస్త్రాన్ని ప్రభావితం చేస్తుంది. దాని ప్రకారం న్యాయమూర్తులు 'న్యాయం, సమానత్వం, మనస్సాక్షి' అనుగుణంగా తీర్పులు చెప్పాలని ప్రోత్సహిస్తుంది.

చట్టం అనేది ఎప్పుడూ విస్తృతంగా ఉండదు. సమగ్రంగా ఉండదు. అన్ని కోణాల్లో దాని గురించి శాసనకర్తలు వివరించలేదు. అందుకని న్యాయమూర్తులు శాసనాలని అందులోని నిబంధనలని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. న్యాయమూర్తి సామాజిక నేపథ్యం, అతని వివేకం, అతని అనుభవం అందుకు ఉపయోగపడతాయి. ప్రభావితం చేస్తాయని అనడం సమంజసంగా ఉంటుంది.

 తీర్పుల్లో సాహిత్యం ఉంది. సాహిత్యంలో చట్టాలు ఉన్నాయి. సాహిత్యంలో చట్టాలు ఎక్కువగా, చట్టాల నేపథ్యం ఎక్కువగా ఉంటుంది. సాహిత్యంలో చట్టం, తీర్పుల నేపథ్యం ఉండటం పెద్ద విచిత్రమేమీ కాదు. కొత్త విషయం కూడా కాదు. చాలా సంవత్సరాలుగా సాహిత్యంలో చట్టాలు ఉన్నాయి. తీర్పుల్లో సాహిత్యం ఉండటమే విశేషం. ఇంగ్లీషులో లెక్కలేనంత సాహిత్యం ఉంది. తెలుగు కూడా అందుకు మినహాయింపు కాదు. క్రైమ్ అండ్ పనిష్ మెంట్, ట్రయల్, మర్చంట్ ఆఫ్ వెనిస్ ఇట్లా ఎన్నింటినో పేర్కొనవచ్చు. ఈ రెండింటి అనుబంధాన్ని వేరు చేయలేం.

చట్టం, సాహిత్యం సంక్లిష్టమైన, బహుముఖమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి. సాహిత్యం చట్టంలోని లోపాలను ఎత్తి చూపుతుంది. చట్టం అదే తీర్పులు చెప్పే క్రమంలో సాహిత్యం ఊతకర్ర మాదిరిగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటి అధ్యయనం సమాజ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న అనుబంధాన్ని తులనాత్మక పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సాహిత్యంలో చట్టం అవసరం లేదని అనడానికి సాహిత్యవేత్తలు కొంతమంది ఉన్నారు. ఏ కాలమైనా చట్టం లేకుండా మనిషి జీవితం లేదు. అయితే తొలి దశల్లో అది కోడిఫై (Codify)అయి ఉండకపోవచ్చు. 
ఏది మంచి? ఏది చెడు అన్నదే చట్టం. శిక్షలే శాసనాలు.

- డా. మంగారి రాజేందర్ ,కవి, రచయిత-


Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.